ఇది ప్రజాస్వామ్యం.. పార్టీలొస్తుంటాయ్.. పోతుంటాయ్!!: డీఎస్
ప్రజాస్వామ్య రాజ్యంలో పార్టీలు వస్తుంటాయని, వాటినెవరూ ఆపలేరనీ, అదేవిధంగా పోతూ కూడా ఉంటాయని పీసీసీ చీఫ్ డీఎస్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శనివారం ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
అధినేత్రికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించినట్లు డీఎస్ చెప్పారు. సంస్థాగత విషయాలపై సోనియాతో చర్చించినట్లు వెల్లడించారు. 2014 ఎన్నికలకు సమాయత్తం కావాలని మేడం తమకు సూచించినట్లు చెప్పారు.
మంత్రి పదవులపై జరిగిన పొరపాట్లు అధిష్టానం దృష్టికి వచ్చాయనీ, వాటిని తాము త్వరలోనే సరిదిద్దుకుంటామని చెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వానికి సభ్యులందరూ మద్దతు పలుకుతూ కలసికట్టుగా ముందుకు సాగాలని సోనియా తనతో చెప్పారని డీఎస్ వెల్లడించారు.