ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన నిరవధిక దీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది. బాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయి మీడియాలు కూడా చంద్రబాబు నిరవధిక దీక్షను పతాక స్థాయిలో ప్రచురిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించడానికి జాతీయస్థాయి నేతలైన ఎండీఎంకే అధినేత వైగో, బాబూలాల్ మరాండీ, అజిత్‌సింగ్, సీతారాం ఏచూరిలతో పాటు ఏఐడీఎంకే ప్రతినిధులు కూడా బాబు దీక్షకు సంఘీభావం తెలుపడానికి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మూడోరోజు దీక్షలో చంద్రబాబుతో పాటు వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కూడా కూర్చోనున్నారు.
కాగా శనివారం మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కమ్యూనిస్టు నాయకుడు ప్రకాశ్ కరత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబును కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా దీక్షలో కూర్చున్న సంగతి తెలిసిందే.
అయితే ఆయన పరిపాలనా హయాంలో రైతులపై దృష్టిపెట్టని చంద్రబాబు నేడు రైతుల గురించి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైతుల బాట పట్టారు. డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆయన కూడా దీక్ష చేపట్టనున్నారు.