తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిస్తున్న ఉద్యమంలో హీరోలెవ్వరూ లేరని.. ప్రజలంతా కథానాయకులేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకేశవరావు చెప్పుకొచ్చారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు చేపట్టిన నిరాహారదీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా కేకే దీక్షా శిబిరం వద్ద టీవీ ఛానల్స్‌తో మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేసే వరకు దీక్ష కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. విద్యార్థుల కేసులను అడ్డుపెట్టుకుని తాము రాజకీయం చేయడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేసుల ఎత్తివేత కోసమే దీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
గతంలో తాము చేసిన ప్రసంగాలు విద్యార్థులను రెచ్చగొట్టి ఉండవచ్చని, ఆ సమయంలో వారు తప్పులు చేసి ఉండవచ్చన్నారు. ఇవన్నీ భావోద్వేగంలో తప్పులు చేసిన తప్పులన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ కేసులు ఎత్తివేయాలని కేకే విజ్ఞప్తి చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినా నిర్ణయం తీసుకోవల్సింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.