విద్యార్థులపై కేసుల ఎత్తివేత: హోం మంత్రి సబితా ప్రకటన

మంగళవారం, 28 డిశెంబరు 2010 (15:54 IST)
ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో విద్యార్ధులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని కేసులను ఒకేసారి ఎత్తివేయడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కుముడులు ఉన్న కేసులను కోర్టుకు నివేదించిన తర్వాతే ఈ కేసులను ఎత్తివేస్తామని రాష్ట్ర హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు.

ఇందులోభాగంగా మొత్తం కేసులు 1,667 ఉండగా, ఇప్పటివరకు 95 కేసుల్లో 729 మందికి విముక్తి కలిగిందన్నారు. తొలివిడతగా మరో 700 కేసుల్లో 3,300 మందికి విముక్తి కలిగించనున్నట్టు ఆమె తెలిపారు. సీఆర్‌పీసీ 321 కింద నమోదైన కేసులను కోర్టుకు నివేదించి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు.

అంతకముందు విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రితో జరిపిన దౌత్యం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం విద్యార్ధులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జనారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, సునీతారెడ్డి, పలువురుతో సహా పలుపులు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు చేసిన వాదనను ప్రభుత్వం నిర్ధ్వద్వందంగా తోసిపుచ్చింది.

వెబ్దునియా పై చదవండి