కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కళ్ళుతెరవడం సంతోషం: కేసీఆర్
మంగళవారం, 28 డిశెంబరు 2010 (16:05 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేదిగా ఉందన్నారు. ఆయన మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించి తన మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ ఇప్పటికైనా తెలంగాణ నేతలు కళ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా జరిగిందే పెద్దమనుషుల ఒప్పందం అని విమర్శించారు. సీమాంధ్ర పాలకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని పూర్తిగా తుంగలోతొక్కారన్నారు.
దీక్ష చేపట్టిన ఎంపీల వెనుక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. వీరు ఒంటరివారు కాదన్నారు. తెలంగాణ ఎంపీలు దీక్షలో కూర్చుంటే అది అధిష్టానాన్ని ధిక్కరించినట్లా అని కేసీఆర్ ప్రశ్నించారు. విజయవాడలో వైఎస్.జగన్ చేపట్టిన లక్ష్యదీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి బాహాటంగా మద్దతు తెలిపితే అది ఉల్లంఘన కాదా అని అడిగారు.
ఇప్పటికైనా నిజం తెలుసుకుని పోరుకు కాంగ్రెస్ ఎంపీలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజానీకానికి ఎంతో ధైర్యం వచ్చినట్టుగా ఉందన్నారు. తెలంగాణ ఎంపీలందరూ కలిసి కట్టుగా అడిగినా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా పార్టీ దిక్కారమనటం మరి విడ్డూరంగా ఉందన్నారు.