కిరణ్ సర్కారు కూలిపోతుంటే చూస్తుంటాం: హరీష్ రావు

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (13:29 IST)
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి లేదా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలలో ఎవరైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కూలదోస్తుంటే తాము ప్రేక్షక పాత్ర పోషిస్తామే గానీ ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించబోమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు తేల్చి చెప్పారు. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యంగా గానీ, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ముఖ్యంకాదన్నారు.

ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తాము ప్రభుత్వాన్ని కూలగొట్టేలా కుట్రలు కుతంత్రాలు పన్నడం లేదన్నారు. ఇందుకోసం జగన్‌తో సంప్రదిస్తున్నట్టు మీడిలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. జగన్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు.

తెలంగాణలో పర్యటన కోసం జగన్ వచ్చినప్పుడు జగన్ అడ్డుకున్నది తొలుత తానేనని ఆయన గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ వ్యతిరేకితో కలుస్తామని అనుకోవటంలో నిజం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అందువల్ల ఆయన తనయుడు జగన్‌ను కూడా తాము తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తామన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదన్నారు. అయితే జగన్ లేదా తెదేపాలలో ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని పడగొట్టినా తమకు సంబంధం లేదన్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణ ఇస్తుందనే నమ్మకంతోనే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదుకున్నామని అయితే ఇప్పుడు కాంగ్రెస్‌పై నమ్మకం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి