కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి కేసీఆర్ భారీ ఝలక్ ఇచ్చారు. జనవరి ఆరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిగ్గు తేల్చడానకి అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలన్న చిదంబరం ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు తిరస్కరించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని స్పష్టం చేశారు.
ఈ అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుంచి ఇద్దరు సభ్యులను పంపిచాలనడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిదంబరానికి ఆయన ఓ లేఖ రాశారు. పార్టీ నుంచి ఒకర్ని పిలిస్తేనే అఖిలపక్షానికి వస్తామని లేదంటే ఈ సమావేశానికి హాజరు కాబోమని స్పష్టం చేశారు.
అస్సలు ఈ అఖిలపక్షం వల్ల ఉపయోగం ఏంటని, పార్టీ నుంచి ఇద్దరు సభ్యులను పిలవడం వెనుక ఆంతర్యమేంటని..? తన లేఖలో చిదంబరాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణా అంశపై తమ అభిప్రాయాన్ని ఇంతకుముందే స్పష్టం చేశామని.. తాజాగా ఏర్పాటు చేయబోయే అఖిలపక్ష సమావేశాన్ని చూస్తుంటే.. ఇది గతాన్ని పునరావృతం చేసిదిలా ఉందన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికను "పెళ్లి తర్వాత పెళ్లిచూపులు"లాంటిదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణా హామీ ఇచ్చిన తర్వాత సంవత్సరం కాలయాపన చేసి నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిపోయి మళ్లీ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. చిదంబరానికి చిత్తశుద్ది ఉంటే పార్టీకి ఒక్కరు చొప్పున పిలవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కావాలనే కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి ప్రత్యేక తెలంగాణా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.