అఖిలపక్షానికి వెళ్లొద్దు..: కేసీఆర్, లేదు మేము వెళ్తాం..: సీపీఐ
ఆదివారం, 2 జనవరి 2011 (14:51 IST)
జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున హాజరు కావాలని ఆయన మెలిక పెట్టారు. దీంతో ఈ సమావేశాలను బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన చిదంబరానికి ఓ లేఖ రాశారు.
అంతే కాకుండా.. సీపీఐ కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావద్దని నారాయణకు కేసీఆర్ సూచించారు. అయితే కేసీఆర్ సలహాను నారయణ సుతాంరగా తిరస్కరించారు. సమావేశానికి హాజరు కాకుండా.. నిరసన తెలిపేకన్నా.. హాజరై నిరసన తెలుపుడమే ఉత్తమమని నారాయణ అన్నారు.
ఈ అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు హాజరవ్వాలన్న చిదంబరం ఆహ్వానంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఒకర్ని పిలిస్తేనే అఖిలపక్షానికి వస్తామని లేదంటే ఈ సమావేశానికి హాజరు కాబోమని స్పష్టం చేశారు. తెలంగాణా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని కేసీఆర్ అన్నారు.