శ్రీకృష్ణ నివేదిక ఫీవర్ : రాష్ట్రంలో ఎటు చూసినా బలగాలే!!
సోమవారం, 3 జనవరి 2011 (13:45 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇందులో పేర్కొన్న అంశాలు ఈనెల ఆరో తేదీన బహిర్గతం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిని వెల్లడించనున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయ సేకరణ జరిపి కేంద్రానికి నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. నివేదికలోని అంశాలు వెల్లడి కాబోతున్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కమిటీ నివేదిక వస్తుందని తెలియగానే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంపై దృష్టి సారించి, భారీ సంఖ్యలో బలగాలను రాష్ట్రానికి పంపిస్తున్నాయి.
ముఖ్యంగా, నివేదికలోని అంశాలు వెల్లడైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాక, అదనపు బలగాలు కావాలని రాష్ట్ర పోలీసు శాఖ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 150 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కోరింది. మొదటి విడతలో 20 కంపెనీలు, రెండో విడతలో మరో 30 కంపెనీల బలగాలను కేంద్రం డిసెంబర్ 30కి ముందే ఆంధ్రప్రదేశ్‌కు పంపించిన విషయం తెల్సిందే.