వీహెచ్‌కు పోయేకాలం దగ్గర పడింది: ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి
మంగళవారం, 4 జనవరి 2011 (12:28 IST)
కాంగ్రెస్ పార్టీ వృద్ధనేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీహెచ్ బలిసి కొట్టుకుంటున్నారని, ఆయనకు పోయేకాలం దగ్గరపడిందంటూ విమర్శించారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిన పదవులు సంపాదించుకున్న వీహెచ్ వంటి వారికి జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
అధిష్టానం మెప్పు పొందడానికి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. పేద మనిషి, మహానేత వైఎస్‌ఆర్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకునే ఎవరికైనా పుట్టగతులుండవని ఆమె జోస్యం చెప్పారు. జగన్‌ను వదులుకొని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ అభిమానులు ఉన్నారని, త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపడుతామని జగన్ తెలిపారు.