రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే పార్టీని వీడుతున్నా: పోచారం
మంగళవారం, 4 జనవరి 2011 (12:59 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం వల్లే తాను పార్టీని వీడిపోతున్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగా లేదన్నారు. తెలంగాణపై గతంలో బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేదన్నారు. దీన్ని తట్టుకోలేకే పార్టీని వీడితున్నట్లు చెప్పారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడుతానని ఆయన ప్రకటించారు. తెదేపాలో తమ ప్రాంత నేతలంతా తెలంగాణకు అనుకూలంగానే వ్యవహరిస్తారనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇదిలావుండగా, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పోచారం.. సోమవారం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విషయం తెల్సిందే. ఇందులోనే రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాసతో కలిసి పని చేయాలని కార్యకర్తల సమక్షంలో తీర్మానం చేసి, ఆ విషయాన్ని హైదరాబాద్‌లో అధికారికంగా పోచారం ప్రకటించారు.