సూరి హత్య కేసులో బాబు కీలక సూత్రధారి: భానుమతి

తన భర్త, మద్దెలచెర్వు సూరి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారి అని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు. తన భర్త హత్యకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

అనంతపురంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త హత్యకు పరిటాల రవి కుటుంబీకులే కారణమన్నారు. పరిటాల ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్‌ల నుంచి ముప్పు ఉందని తన భర్త హత్యకు గురికాకముందే తన వద్ద వాపోయాడన్నారు.

సూరి రాజకీయాల్లోకి వస్తే అనంతపురంలో తెదేపా అడ్రస్ లేకుండా పోతుందనే భయంతోనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రోత్సహంతోనే మాజీ ఎమ్మెలేలు నారాయణరెడ్డి, చెన్నారెడ్డి కుటుంబాలు అంతమయ్యాయన్నారు.

ఇకపోతే.. సూరి హత్య జరిగి ఇన్నిరోజులైనా భానును పోలీసులు పట్టుకోలేకపోవడం, కేసు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.

త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సీబీఐ విచారణ జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. భాను ఆస్తులు, సెల్‌ఫోన్ కాల్స్ ఆరా తీయడంపై పోలీసులు పెట్టిన దృష్టి భానును అరెస్టు చేసేందుకు పెట్టలేదని భానుమతి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి