నేడు తెరాస కార్యవర్గ సమావేశం: భవిష్యత్ వ్యూహంపై చర్చ!!
మంగళవారం, 18 జనవరి 2011 (11:14 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం మంగళవారం భేటీ కానుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహిస్తారు. ఇందులో కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా, నియోజకవర్గాల ఉద్యమ ఇన్‌ఛార్జులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
ఈ కీలక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం, తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ఇందులో చర్చిస్తారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెరాస మినహా ఇతర రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ జరుగనుంది.
అంతేకాకుండా జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 26వ తేదీలోపు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో దీనిపై కూడా చర్చించనున్నారు. ఈనెల ఆకో తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని తెరాస బహిష్కరించిన విషయం తెల్సిందే.
దీంతో తెలంగాణ అంశంపై చివరగా నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలా వద్దా అనే అంశంపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.