కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రజలే అవిశ్వాసం పెట్టొచ్చు: కిషన్ రెడ్డి
మంగళవారం, 18 జనవరి 2011 (15:55 IST)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విసిగిపోయిన సామాన్య ప్రజానీకం ఏదో ఒక రోజున కడుపు రగిలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పని చేయడం లేదన్నారు.
సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాలు, ఆందోళనలలో పాల్గొంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే మాత్రం ప్రజలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారన్నారు.
తెలంగాణ అంశాన్ని తొక్కిపెట్టడానికి కేంద్రం మంత్రి వర్గస్తరణ చేస్తే అది మూర్ఖత్వమే అవుతుందని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇకపోతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో ఎన్డీఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.