కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పదవుల పిచ్చి: ఈటెల్ రాజేందర్
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రజల ఆకాంక్ష పట్టదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కాదని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఎస్.జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఏం చేశారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నాయకులు పదవులు తీసుకుంటారా, వదిలేస్తారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
తెలంగాణ కోసం ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఇందులోభాగంగా 22వ తేదీన విద్యార్థుల సదస్సు నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు చెందిన అన్ని విద్యార్థి సంఘాలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 28వ తేదీన విడుదలయ్యే జై బోలో తెలంగాణ సినిమాను తెలంగాణకు చెందిన అందరూ చూసేలా పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారన్నారు.