సీఎంకు వారిని సస్పెండ్ చేసే దమ్ముందా?: పెద్దిరెడ్డి సవాల్
దివంగత ముఖ్యమంత్రి తనయుడు, కడప మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి వెంట వెళ్లే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా అని మాజీ మంత్రి, శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. జగన్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి తప్పించుకోవడం కిరణ్ కుమార్ రెడ్డి చేతకానితనమని పెద్దిరెడ్డి విమర్శించారు.
వై.ఎస్.జగన్ ఎన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ సేవ చేశారని ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారంటూ సీఎం కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పెద్దెరెడ్డి మండిపడ్డారు. ఇంకా వై.ఎస్. జగన్ వెంట వెళ్లేవారు రాజీనామా చేయాలన్న కేకేఆర్ వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సీం కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తిరుగుబాటు శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. కావాలంటే తాను ఈ రోజే రాజీనామా చేస్తానని ఆయన ఆదివారం ఉదయం మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేయాలన్నారు. రాజీనామా చేస్తే ఆయనపై తానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.
తాను పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయడం లేదని, ముఖ్యమంత్రిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని, అలాంటప్పుడు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తనపై సిఫార్సు చేయాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.