మంత్రికే భద్రత లేదు.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో!?
కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి రాజీనామా చేసిన వై.ఎస్.జగన్మోహన రెడ్డి అక్రమ ఆస్తులపై తాను రాసిన లేఖను సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత నాకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని చేనేత మరియు జౌళీ శాఖామాత్యులు శంకర్రావు తెలిపారు.
మంత్రి హోదాలో వున్న తనకే భద్రత లేదని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటోనని శంకర్రావు ప్రశ్నించారు. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులపై అభియోగాలున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంపై పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని శంకర్రావు ఆరోపించారు.
కాగా, వై.ఎస్. జగన్మోహన రెడ్డి అక్రమ ఆస్తులపై తాను రెండు లేఖలు రాసిన మాట వాస్తవమేనని, ఆ లేఖలు మంత్రి అయిన తర్వాత రాయలేదని శంకర్రావు స్పష్టం చేశారు.
గత అక్టోబరులో మొదటి లేఖ, నవంబరులో రెండో లేఖను రాశానని చెప్పారు. లేఖలో తాను రాసిన విషయాలకు ఆధారాలు ఉన్నాయని అంచనాకు వచ్చినందువల్లే హైకోర్టు సుమోటోగా స్వీకరించి నోటీసులు పంపించిందని శంకర్రావు వెల్లడించారు.