కాంగ్రెస్ - తెదేపాలకు తెలంగాణా ప్రజలు బొంద పెడ్తరు
గురువారం, 27 జనవరి 2011 (17:17 IST)
రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీకి బలం లేదనీ, ఎప్పుడైనా పడిపోవచ్చని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. అయితే అలా పడిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ - తెదేపా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణా ప్రజలు బొంద పెడతారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణా ప్రాంతంలో పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు.
ధైర్యముంటే పోలీసు బందోబస్తు లేకుండా రచ్చబండ నిర్వహిస్తే తెలంగాణా ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మరోవైపు మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాస అయ్యింది.
సభలోకి తెరాస కార్యకర్తలు దూసుక వచ్చి కుర్చీలను విరగ్గొట్టి జై తెలంగాణా అంటూ నినాదాలు చేశారు. మూడు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.