దిగ్విజయ్ : టీ ఇస్తే విలీనం చేస్తామని కేసీఆర్ మాటిచ్చారు!

శుక్రవారం, 13 డిశెంబరు 2013 (16:53 IST)
File
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తమకు మాట ఇచ్చారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో 371డి ఆర్టికల్ అడ్డంకి కాబోదని, దీనిపై న్యాయ శాఖ క్షుణ్ణంగా అధ్యయనం చేసిందన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని... శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై బీసీఏ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

ముసాయిదా బిల్లు సభకు వచ్చిన తర్వాత సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన టీడీపీ, వైఎస్సార్సీపీలు యూటర్న్ తీసుకున్నాయని, ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదరటంలేదంటూ ఈ రెండు పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.

జలవనరులు, శాంతి భద్రతలు, ఉమ్మడి రాజధాని, అభివృద్ధి తదితర అంశాలను కేంద్రం పరిశీలిస్తుందని, విభజన జరిగిన తర్వాత ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దిగ్విజయ్ చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా ఆస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.

ఇకపోతే.. రాష్ట్ర విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయమే అంతిమమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం కూడా పాటించాల్సిందేనని తెలిపారు. గోదావరి, కృష్ణా నదీజలాల విషయాన్ని ప్రత్యేక బోర్డులు చూసుకుంటాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి