60 యేళ్ళ కల తెలంగాణ.. ఇచ్చాం.. ఇక మీయిష్టం : సోనియా

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (18:08 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కాకముందే తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టిందని, ఒక్క కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, 60 యేళ్ల కలను సాకారం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీఆర్ఎస్ పాత్ర శూన్యమన్నారు.

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెడుతున్నామన్నారు. పారదర్శకత, జవాబుదారితనం కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు.

తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి ప్రజలు 60 సంవత్సరాల సంఘర్షణ చేశారని, కాంగ్రెస్ ఆ కల నెరవేర్చిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటంలో అమరులైన వారందరికీ సలాం చేస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు నచ్చ చెప్పడానికి సమయం పట్టిందని, వారికిచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చి తీరుతామన్నారు.

2000‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రజల ఆకాంక్షను చెప్పారని, కాంగ్రెస్ లేవనెత్తిన అంశాన్ని టిఆర్ఎస్ 2001లో అందుకుందని సోనియా పేర్కొన్నారు. లోక్‌సభలో, రాజ్యసభ లో బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదించడం జరిగిందన్నారు. రాజ్యసభలో బిల్లును అడ్డుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తే లోక్‌సభలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీలు బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించాయని ఆమె ఆరోపించారు.

అదేవిధంగా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడానికి కృషి చేస్తామన్నారు. సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. తెలుగుదేశం, బీజేపీ పార్టీల పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. తన అత్త ఇందిరా, భర్త రాజీవ్‌లు దేశం కోసం ప్రాణాలు అర్పించారని సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి