రాజశేఖరుడన్నా... రామచంద్రుడన్నా... ఒక్కరే!!

శనివారం, 5 సెప్టెంబరు 2009 (13:20 IST)
File
FILE
'వేయిమంది బంధువులున్నా.. ఆప్తమిత్రుడు ఒక్కడుంటే చాలు' ఈ వాక్యం ఇద్దరి మధ్య ఉండే స్నేహబంధానికి మచ్చుతునక. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన ఆప్తమిత్రుడు కేవీపీ.రామచంద్రరావులకు ఇట్టే సరిపోతుంది. 'వారిద్దరి శరీరాలు వేరయినా.. ఆత్మమాత్రం ఒక్కటే'. కులం పేరుతో వారిద్దరిని విడదీయాలని మానవమాత్రులు చేసిన అనేక కుట్రలు ఏ ఒక్కరోజూ ఫలించలేదు కదా.. వారిమధ్య స్నేహబంధం మరింత దృఢపడింది.

ఎక్కడో కర్ణాటకలోని గుల్బర్గా వైద్య కళాశాలలో చిగురించిన వైఎస్-కేవీపీ స్నేహం.. నాలుగు దశాబ్దాల పాటు నిరాటంకంగా సాగింది. ఈ 40 యేళ్ల కాలంలో కేవీపీతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేదని గతంలో 'స్నేహితుల దినోత్సవం' రోజున వైఎస్ స్వయంగా వెల్లడించారు కూడా. అలాంటి వారి స్నేహాన్ని మానవ మాత్రులు విడదీయ లేకపోయారు. కానీ.. వారి స్నేహబంధాన్ని చూసి ఓర్వలేని మృత్యుదేవుడు మాత్రం, హెలికాఫ్టర్ ప్రమాదం పేరుతో విడదీసి పైచేయి సాధించాడు.

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో వైఎస్ వైద్య విద్యను అభ్యసించే రోజుల్లో కేవీపీతో పరిచయం ఏర్పడింది. వైఎస్ కంటే ఓ ఏడాది చిన్నవాడైనా కేవీపీ అదే కళాశాలలో తన జూనియర్. ఆ తర్వాత యాదృచ్ఛికంగా వారిద్దరు ఒకే రూమ్‌మేట్స్ అయ్యారు. అలా.. చిగురించిన వైఎస్-కేవీపీ స్నేహం.. దినదిన ప్రవర్థమానంగా వర్థిల్లింది. స్నేహితులంటే.. వారే...? అని ఇతరులు అసూయ పడేలా వారిద్దరు నడుచుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రాజశేఖరుడు ఎదిగినా.. తమ స్నేహానికి మాత్రం పదవులు, అధికారం అడ్డుకాదని చేతల ద్వారా నిరూపించాడు రైతురాజు. తాను ఎక్కడ ఉంటే తన ఆత్మలాంటి కేవీపీ అక్కడ ఉంటారని పలు మార్లు బహిరంగంగానే స్పష్టం చేశారు. అది అధికార కార్యక్రమం అయినా.. అనధికార సభ అయినా అక్కడ వైఎస్ వెన్నంటి కేవీపీ ఉండేవారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తొలిసారి ఎంపికైన వైఎస్.. కృతజ్ఞతలు తెలిపేందుకు అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి వద్దకు వెళ్లారు. పోతూపోతూ తన వెంట కేవీపీని తీసుకెళ్లారు. వైఎస్ పక్కన కేవీపీని చూసిన చెన్నారెడ్డి ఒకింత ఆగ్రహంతో ఈయన్నెందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించారు. వైఎస్ వెంటనే స్పందించి.. నేను ఎక్కడ ఉంటే నా స్నేహితుడు అక్కడ ఉంటాడని ముఖాన్నే తెగేసి చెప్పిన ముక్కుసూటి మనిషి వైఎస్.

అంతేకాకుండా, తాను మాత్రమే కాకుండా, తన వెన్నంటి ఉండే కేవీపీకి కూడా అధికార దర్పాన్ని రుచి చూపించిన ఘనుడు వైఎస్. తొలుత రాజ్యసభ సభ్యుడిగా కేవీపీని ఎంపిక చేసి ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు కట్టబెట్టి, తన పక్కనే కూర్చోబెట్టుకున్న స్నేహశీలి రాజశేఖరుడు. ఇలా.. ఒకటేంటి అనేక సంఘటనలు వారిద్దరి స్నేహబంధం ఎంత పటిష్టతమైనదో చూపుతాయి.

అంతేకాకుండా.. వైఎస్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంలోనూ.. ఆయన ప్రవేశపెట్టే పథకాలు ప్రజాదరణ పొందడంలోనూ కేవీపీదే కీలక పాత్ర. ప్రజల నాడిని పసిగట్టడంలో వైఎస్ దిట్ట అయినప్పటికీ.. వారికి ఎలాంటి పథకాలు అవసరమో రూపకల్పన చేసే తెరవెనుక కీలక పాత్రను కేవీపీ పోషించేవారు.

అందుకే.. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్ సీఎంగా కేవీపీ వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వచ్చాయి. వీటికి వైఎస్ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చి స్నేహానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఇలా సాగిన వైఎస్-కేవీపీల నాలుగు దశాబ్దాల స్నేహ ప్రయాణం.. రాజశేఖరుని అస్తమయంతో ముగిసింది.

వెబ్దునియా పై చదవండి