జగన్ పార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరో బీహారేనా!!

రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయా? ఈ పార్టీకి 'కంచు'కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 'మంచు'కోటగా మారనుందా? 2004 సంవత్సరానికి ముందు.. దాదాపుగా ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీకి దివంగత ప్రజానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆపద్బాంధవుడిగా అవతరమెత్తి జవసత్వాలు ప్రసాదించారు. పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా కలియతిరిగి కాంగ్రెస్‌కు పట్టంగట్టాడు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. గత ఆరేళ్ళుగా సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ పడవ ప్రయాణంలో వైఎస్ఆర్ హఠాన్మరణం భారీ కుదుపునకు లోనైంది.

ఆ తర్వాత సీఎం పగ్గాలను రోశయ్యకు అప్పగించడం జరిగింది. ఆయన సీఎంగా ఉన్న 14 నెలల కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గ్రహించిన అధిష్టానం.. రోశయ్యను వయోభారం, అనారోగ్యం కారణాలతో సీఎం కుర్చీ నుంచి తొలగించింది. ఆయన స్థానంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ యూత్ కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగించింది.

ఈయన ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గం తొలి భేటీకి ముందే భారీ కుదుపునకు లోనైంది. ఈ కుదుపు వల్ల కాంగ్రెస్‌కు జరిగే నష్టమెంతో, ఇప్పటికిప్పడు చెప్పడం సాధ్యం కాదు. అయితే, అధిష్టానం జోక్యంతో కేకేఆర్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి గండం లేనట్టుగా చెప్పొచ్చు. కానీ పార్టీలో కీలక శాఖలు దక్కక, మంత్రిపదవులు రాక గుర్రుగా ఉన్న మంత్రులు, అసంతృప్త ఎమ్మెల్యేలు ఎపుడు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారో చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజార్టీతో సాగుతోంది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడ, ప్రజారాజ్యం, ఎంఐఎం, తెరాస పార్టీ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ఈ నిజాన్ని ఏ ఒక్క రాజకీయ నేత కాదనలేరు. అదేసమయంలో జగన్‌ శిబిరాన్నీ తక్కువ అంచనా వేయలేమని, తలపండిన కాంగ్రెస్‌ నేతలే అంగీకరిస్తున్నారు.

ప్రభుత్వాలను బెదిరించడం, పడగొట్టడంలో చక్రం తిప్పుతున్న కర్ణాటక మంత్రులు గాలి బ్రదర్స్‌తో జగన్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ రాజకీయాలపై గాలి బ్రదర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ మనుగడ దినదినగండంగా మారే అవకాశాలు లేకపోలేదు.

తాజా పరిణామాలు 2014లో కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే ప్రధాన సమస్య. జగన్‌ సొంత పార్టీ పెడితే, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు చీలుతుందనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఈ చీలిక ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, ఇప్పుడే అంచనా వేయడమూ సాధ్యం కాదు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ, జగన్‌ శిబిరంలోకి భారీగానే వలసలు ఉంటాయి.

2014లో రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న కాంగ్రెస్‌ ఆశలపైనా, రాష్ట్ర తాజా పరిణామాలు తప్పక ప్రభావం చూపుతాయని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌ను పిఎంగా చూడాలంటే, జగన్‌ను సిఎంను చేయండి అంటూ రాష్ట్రంలో కొంతకాలంగా ఆయన మద్దతుదారులు గట్టిగానే డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అది నెరవేరే సూచనలు లేకపోవడంతో జగన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీని పెట్టనున్నట్టు ప్రకటించారు.

ఇది కాంగ్రెస్‌కు ఏమాత్రం మింగుడుపడని అంశంగా చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితమే బీహార్‌లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి, 2011, 12 సంవత్సరాల్లో జరుగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఒక అగ్నిపరీక్షలాంటివి. 2004లో 29, 2009లో 33 లోక్‌సభ స్థానాలను అందించిన ఆంధ్రప్రదేశ్‌లో, కాంగ్రెస్‌కు ముందున్నది సంక్లిష్ట సమయమే.

పైపెచ్చు.. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు డిమాండు ఏ దిశగా వెళ్తాయన్నది కూడా... రానున్న కాలంలో జగన్‌ బలం, బలగాన్ని ప్రభావితం చేయనుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి బలమైన రాష్ట్రంగా ముద్రపడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ గోడలు బీటలు వారే ప్రమాందం పొంచివుందని ఘంటాపథంగా చెప్పొచ్చు.

వెబ్దునియా పై చదవండి