ఆఫ్గన్ రాజధానిలో తీవ్రవాదుల దాడి: 9మంది మృతి

సోమవారం, 18 జనవరి 2010 (18:35 IST)
FILE
ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని దేశాధ్యక్షుడి భవనాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పేలుడుపదార్థాలు, తుపాకులు తదితర విధ్వంసకర సామగ్రితో మిలిటెంట్లు సోమవారం దాడులకు పాల్పడి, భీభత్సం సృష్టించడంతో తొమ్మిది మంది మృతి చెందగా మరో నలభై మందికి తీవ్ర గాయాలైనాయి.

కాబూల్‌లోనున్న దేశాధ్యక్షుడి భవనం, న్యాయశాఖ, ప్రముఖులు బసచేసే సెరీనా హోటళ్లున్న ప్రాంతంలో మానవ బాంబులతో కూడిన దాదాపు ఇరవై మంది తీవ్రవాదుల బృందం సోమవారం దాడులకు పాల్పడింది. స్థానికంగానున్న ఓ షాపింగ్‌సెంటర్‌ భవనంలో దాక్కుని వీరు కాల్పులు ప్రారంభించారు. దీంతో వెంటనే భద్రతాదళాలు అప్రమత్తమై రంగంలోకిదిగి ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దాదాపు మూడు గంటలపాటు యుద్ధ వాతావరణం నెలకొందని భద్రతా దళాధికారులు తెలిపారు.

రాజధానిలోని అన్ని వీధులు, హోటళ్లు, ప్రభుత్వ భవనాలను సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. పరస్పర కాల్పులతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాలయి. దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా నలభై మంది తీవ్ర గాయాలపాలైనారు. మృతి చెందిన వారిలో ఒకరు పౌరుడు కాగా నలుగురు సైనికులున్నట్లు భద్రతా దళాధికారులు వివరించారు.

దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలను బూటకపు ఎన్నికలుగా అభివర్ణిస్తున్న మిలిటెంట్లు సోమవారం అధ్యక్ష భవనంలో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండటంతో దాన్ని నిరసిస్తూ దాడులకు పాల్పడ్డారు. అయితే మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా జరిగిందని, ప్రజా ప్రతినిధులంతా క్షేమంగా ఉన్నారని అధ్యక్ష నివాసం ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా ఐక్యరాజ్యసమితి శాంతి బృందాలను వ్యతిరేకిస్తున్న మిలిటెంట్లు వారు ఉపయోగించే ఓ గెస్ట్‌హౌస్‌పై దాడిచేసి ఇద్దరిని హతమార్చినట్లు ప్రాథమిక సమాచారం.

వెబ్దునియా పై చదవండి