స్విస్ బ్యాంకు నల్లధన జాబితాలో భారతీయులే టాప్..!!

భారతదేశంలో అవినీతికి కొరతే లేదు అనడానికి ఈ తాజా సంఘటనే నిలువెత్తు నిదర్శన. తమ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం గురించి నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది స్విస్ బ్యాంక్. స్విస్ బ్యాంక్ అసోషియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ "యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్" (యూబిఎస్)లో ఉన్న నల్లధన డిపాజిటర్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారన్న నిర్ఘాంతపోయే నిజాన్ని నిదానంగా ప్రకటించింది.

భారతీయులు 65 వేల 223 వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలు కూడా ఈ జాబితాలో ముందున్నాయి. నల్లధన జాబితాలో రష్యా ద్వితీయ స్థానంలో ఉండగా.. చైనా ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. స్విస్ బ్యాంకులో దాగి ఉన్న నల్లధన వివరాలు రాబట్టేందుకు ఓవైపు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.

గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు కూడా స్విస్ బ్యాంకులో దాచిన నల్లధన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా.. నల్లధనం గురించి ఖచ్చితమైన నగదు వివరాలను స్విస్ బ్యాంక్ అసోసియేషన్ వెల్లడించడం కూడా ఇదే తొలిసారి. ఈ నల్లధనాన్ని భారతదేశ అభివృద్ధిపై వెచ్చిస్తే మనం కూడా అగ్రదేశాల సరసన నిలుస్తామనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భారతదేశంలో అవినీతికి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.

వెబ్దునియా పై చదవండి