బ్రిటన్ రాకుమారుడి కారుపై బూట్లు విసిరిన విద్యార్థులు

యూనివర్శిటీ విద్యార్థుల ట్యూషన్‌ ఫీజుల పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు నిరసనగా బ్రిటన్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఆ దేశపు రాకుమారిడిని కూడా తాకింది. బ్రిటన్ రాకుమారుడు చార్లెస్ ఆయన సతీమణి కమిల్లాతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై విద్యార్థులు దాడి చేసి దానిపైకి బూట్లు, బాటిళ్లు విసిరారు.

ప్రతి సంవత్సరం జరిగే రాయల్ వెరైటీ పెర్ఫార్మెన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి చార్లెస్ దంపతులు తమ రోల్స్‌రాయిస్ కారులో వెళ్తుండగా, అనూహ్య రీతిలో విద్యార్థులు దాడి చేసి తమ నిరసన వెలిబుచ్చారు. ట్యూషన్‌ ఫీజుల పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా కామన్స్‌ ఓటేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

అయితే ఆ వాహనంలో రాజ దంపతులు ప్రయాణిస్తున్న విషయం కొందరు విద్యార్థులకు తెలియక ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆ కారుపై దాడి చేసారు. దారిన వెళ్తున్న కొందరు మీరు దాడి చేస్తున్న వాహనం బ్రిటీష్ రాజకుటుంబ సభ్యులదని చెప్పడంతో విద్యార్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ వెంటనే తమ తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గి వాహనం వెళ్లడానికి దారి ఇచ్చారు.

కాగా.. ఈ దాడిలో రాజ దంపతులకు ఎలాంటి హాని జరగలేదని మామూలుగా కార్యక్రమంలో పాల్గొన్నారని చార్లెస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా.. ఈ దాడిని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ఖండించారు. ఇలా రాకుమారి, రాజకుమారుడు నిరసనకారుల దాడికి గురికావడం దిగ్భ్రాంతిని కల్గించిందని, ఇది శోచనీయమని ఆయన అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కామెరూన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి