హాల్‌బ్రూక్ పరిస్థితి విషమం: కోలుకోవాలని ఒబామా ప్రార్ధన

అనారోగ్యానికి గురైన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు అమెరికా ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేసిన రిచర్డ్ హాల్‌బ్రూక్‌కు జార్జి వాషింగ్టన్‌ ఆస్పత్రిలో సర్జరీ చేయటంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 69 ఏళ్ల హాల్‌బ్రూక్ గత శుక్రవారం అనారోగ్యం కారణంగా ఐసియూలో చేర్చిన సంగతి తెలిసిందే.

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాలలో ఒబామాకు కీలక వ్యక్తిగా ఉన్న హాల్‌బ్రూక్‌కు శనివారం ఓ సర్జరీ నిర్వహించారు. అయినప్పటికీ అతను కోలుకోకపోవడంతో సోమవారం అదనంగా మరో సర్జరీ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పిజె క్రౌలీ తెలిపారు. ఇప్పటకీ ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, హాల్‌బ్రూక్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, సిబ్బంది ఆయన త్వరగా కోలుకోవాలని ఎదురుచూస్తున్నారని క్రౌలీ చెప్పారు.

కాగా.. అస్వస్థతకు గురైన హాల్‌బ్రూక్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ప్రార్థనలు నిర్వహించారు. అమెరికా విదేశీ పథకాలను హాల్‌బ్రూక్‌ సమర్థవంతంగా నిర్వర్తించేవారని ఒబామా ప్రశంసించారు.

ఈ మేరకు గత శనివారం రాత్రి హాల్‌బ్రూక్‌ భార్యను కలిసిన ఒబామా దంపతులు హాల్‌బ్రూక్‌ కోలుకోవాలని ప్రార్ధనలు జరిపారు. హాల్‌బ్రూక్ కుటుంబ సభ్యులను ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఫోన్‌కాల్ చేసి పరామర్శిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి