కొత్త సంవత్సరం రోజున ఈజిప్ట్, నైజీరియా దేశాల్లో విషాదం నెలకొంది. ఈ దేశాలపై ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపి 50 మందికి పైగా అమాయక ప్రజలను ప్రాణాలను హరించివేశారు. కాగా.. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. "ఈజిప్ట్, నైజీరియాలపై ఉగ్రవాదుల బాంబు దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాన"ని హవాయ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న భక్తులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రావాదులు దాడులు జరిపారు. ఈ ప్రమాదంలో 21మంది మరణించగా.. క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు డజన్ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
అలాగే.. నైజీరియాలో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి గుమిగూడిన అమాయకపు ప్రజలను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు బాంబులతో దాడులు చేసి మారణహోమం సృష్టించారు. ఈ ప్రమాదంలో 31 మంది అమాయక ప్రజలు మరణించారు. క్రిస్టియన్ భక్తులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులు చేశారని మానవ జీవితానికి గుర్తింపు, గౌరవం లేకుండా పోతున్నాయని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు.