భారత సంతతికి చెందిన అమెరికా అంతరీక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ గురువారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అత్యధిక కాలం అంతరీక్షంలో గడిపిన మహిళగా ఈ సంవత్సరం సరికొత్త రికార్డును నెలకొల్పిన సునీత తన వారం రోజుల భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్నారు.
దశాబ్ద కాలం అనంతరం అహ్మదాబాద్‌లోని బంధువులను సునీత కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యాసంస్థలు నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. చారిత్రాత్మకమైన సబర్మతీ ఆశ్రమంలో శుక్రవారం జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధికి ఆమె నివాళులర్పిస్తారు.
అనంతరం ఉత్తర గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలో గల ఝలసాన్ గ్రామంలోని తన పూర్వికుల గృహాన్ని సునీతా విలియమ్స్ సందర్శిస్తారు. అదేసమయంలో ఈ నెల 25వతేదీన జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అహ్మదాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెను సన్మానిస్తారు.
అహ్మదాబాద్ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో జరుగనున్న 58వ అంతర్జాతీయ వ్యోమగామల సదస్సులో పాల్గొని భారత శాస్త్రవేత్తలతో అంతరీక్షం యానంలో తాను పొందిన అనుభవాలను సునీతావిలియమ్స్ నెమరు వేసుకుంటారు.
వాషింగ్టన్ కేంద్రంగా గల భారత్-అమెరికా సంఘాల జాతీయ ఫెడరేషన్ సునీతా విలయమ్స్ భారత సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.