కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్

మంగళవారం, 18 నవంబరు 2008 (02:29 IST)
జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం పది నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 55 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేసమయంలో చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ ఎన్నికలు దాదాపు ప్రశాంతంగానే ముగియడం అధికారుల్లో ఆనందాన్ని మిగిల్చింది.

పోలింగ్ విశేషాల గురించి ఎన్నికల ప్రధాన అధికారి బీఆర్ శర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల ప్రాబల్యం గల బండిపోరా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 74శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. అలాగే మెంధార్‌లో 65శాతం, సురాన్‌కోట్‌లో 58శాతం, కార్గిల్‌లో 57శాతం, నోబ్రాలో 55శాతం, లేలో 53శాతం పోలింగ్ జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో భారీగా పోలింగ్ జరిగే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో ఎన్నికలు జరిగే చాలా ప్రాంతాలు పోలీసుల, సైన్యం చేతిలో దిగ్భంధంగా మారాయి.

వెబ్దునియా పై చదవండి