జమ్మూలో రెండో విడత‌ ఎన్నికలు: 65 శాతం పోలింగ్

జమ్మూ-కాశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రెండో విడత ఎన్నికలను బహిష్కరించాలన్న వేర్పాటు వాదుల పిలుపును ప్రజలు ఏమాత్రం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఒకవైపు రాజౌరి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో తీవ్ర చలిని కూడా పట్టించుకోక వృద్ధులు తమ ఓటును ఉపయోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు బారులు తీరారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో ఆదివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్‌లోని దర్హల్‌లో అధికంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లా పోటీ చేస్తున్న గందర్బల్‌లో 35 శాతం నమోదు కాగా, దర్హల్‌లో 46 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇదిలా ఉండగా, జమ్మూ-కాశ్మీర్‌లో ఈ నెల 17వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. పది నియోజక వర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఇకపోతే... జమ్మూలో మూడో పోలింగ్ ఓటింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి