జమ్మూకాశ్మీర్‌లో ప్రారంభమైన పోలింగ్

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగోదశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 18 సెగ్మెంట్లలో ఈ పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. ఇటీవల సోపూర్, బారాముల్ల జిల్లాల్లో మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని సెగ్మెంట్లలో గట్టి భద్రతను కల్పించారు.

కాగా, ఈ మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. అయితే.. పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఎలాంటి సంఘటనలు జరుగలేదు. అయినప్పటికీ భద్రతను మాత్రం కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా 18 స్థానాల్లో 256 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ 18 స్థానాల్లో ఏడు నియోజకవర్గాలు బారాముల్లా జిల్లాలోనూ, ఐదు సీట్లు బద్గమ్ జిల్లాలోనూ, ఉధమ్‌పూర్, రియాసీ జిల్లాల్లో మూడేసి చొప్పున ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి