కోర్టు శిక్షించింది.. ప్రజలు క్షమించారు: సంజయ్

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2009 (11:04 IST)
FileFILE
తనకు కోర్టు ఆరేళ్ళ శిక్ష విధించగా, ప్రజలు మాత్రం అన్ని విధాలుగా గౌరవించి, క్షమించారని రాజకీయనేతగా మారిన బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అభిప్రాయపడ్డారు. గురువారం పాట్నాలో శ్రీకృష్ణ మెమోరియల్ హాల్‌లో జరిగిన సుఖ్‌దేవ్ నారేన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో "మున్నభాయ్" పాల్గొని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

ముంబై ప్రత్యేక కోర్టు (టడా) విధించిన శిక్షతో పూర్తిగా నిరాశానిస్పృహలకు లోనైనట్టు చెప్పారు. అయితే.. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాల ముందు తాను కష్టాల నుంచి గట్టెక్కినట్టు చెప్పారు. తాను నటించిన "మున్నభాయ్" చిత్రంలో గాంధీ సిద్ధాంతాలను ప్రధానంగా చూపించిన విషయం తెల్సిందే. ఒకదానికి బానిస కావడం చాలా సులభమని, అయితే దాని నుంచి బయటపడటమే చాలా కష్టమని ఈ రాజకీయ నేత అన్నారు.

ఆరోగ్యవంతమైన సుఖమయ జీవితం కోసం యువత క్షణికావేశానికి లోనుకాకుండా, వ్యసనాలకు దూరంగా ఉండాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ బాలీవుడ్ నటుడు కేవలం సినీ హీరోగానే కాకుండా.. యువతలో జిమ్ సంస్కృతిని ప్రోత్సహించిన వ్యక్తిగా మంచి ఆదరణ ఉందని సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. డ్రగ్స్‌కు బానిసుడైన మున్నభాయ్, వాటి నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది ఊహించలేని విషయమన్నారు.

అందువల్ల యువత కూడా ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువతలో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో సంజయ్ దత్ మంచి ప్రేరణగా నిలుస్తారని సమాజ్‌వాదీ పార్టీ ప్రధానకార్యదర్శి, ఎంపీ అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ భార్య మాన్యత కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి