యూపీఏలో భాగస్వాములం: లాలూ-పాశ్వాన్

తాము యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నట్టు కేంద్ర మంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), రామ్ విలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ అధ్యక్షుడు) స్పష్టం చేశారు. కేంద్రంలో మతవాద శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము యూపీఏలో మిత్రపక్షాలుగా ఉంటున్నట్టు చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఆర్జేడీ, ఎల్జేపీలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయంపై వారు మంగళవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేసి వెల్లడించారు. దేశంలో మతవాద శక్తులను ఓడించి, లౌకివాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ 25 స్థానాల్లోనూ, లోక్‌జన శక్తి పార్టీ 12 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం మూడు సీట్లు మాత్రమే కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పెదవి విప్పలేదు. గత 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు, ఆర్జేడీ 26, ఎల్జేపి 8 సీట్లలో పోటీ చేశాయి.

వెబ్దునియా పై చదవండి