అధికారం కోసమే భాజపా రామభజన: పవార్

FileFILE
భారతీయ జనతా పార్టీపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. భారతీయ జనతా పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నపుడు, అధికారంలో లేనపుడు మాత్రమే రామ మందిర అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆయన విమర్శించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నపుడు రాముడిని వనవాసానికి (రామ మందిర అంశాన్ని విస్మరించారు) పంపారు. ప్రస్తుతం భాజపా కోల్పోతున్న ప్రాభవాన్ని నిలుపుకునేందుకు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని ప్రకటనలు చేస్తున్నారని నాసిక్‌ జిల్లాలో జరిగిన పలు బహిరంగ సభల్లో మంత్రి శరద్ పవార్ ఆరోపించారు.

నాసిక్ జిల్లాలోని సతనా, కల్వాన్, గోటి ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్-ఎన్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత ఐదేళ్ళలో పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. అలాగే, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించిందని, వ్యవసాయ, పరిశ్రమ రంగాల్లో పెను మార్పులతో పాటు పురోగతిని సాధించిదని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి