లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రగతికి పట్టం కట్టారని, ఇక్కడ రాజకీయాలకు తావివ్వకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ పేర్కొన్నారు.
నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలామ్ మీడియాతో మాట్లాడుతూ...దేశ ప్రజలు తమ ఓటుద్వారా ప్రగతికి పట్టం కట్టారని ఆయని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే ఓ కొత్త శక్తిగా అవతరించనుందని ఆయన జోస్యం చెప్పారు. పటిష్టమైన పాలన అందించిన పార్టీకే మళ్ళీ పట్టం కట్టడం వెనుక ప్రజలు ప్రగతిని స్వాగతించారని ఆయన పేర్కొన్నారు.
దేశ ప్రగతికి ఆర్థిక మూలాలు ప్రధానమని, దీనిపైనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలుంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలవుతున్నాయని దీంతో ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది అందుతోందని ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కలామ్ అకోలాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి పేర్కొన్నారు.