భారత్‌లో మారణహోమానికి పాక్ పథకం: చిదంబరం

ఆదివారం, 25 అక్టోబరు 2009 (15:27 IST)
పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులను భారత్‌లోకి పంపి మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ పథకం పన్నుతోందని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం ఆరోపించారు. అందువల్ల భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ముంబై దాడులతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేసి, వారిని శిక్షించే ఉద్దేశం పాకిస్థాన్‌కు లేదని ఆయన ఆరోపించారు. అదేసమయంలో పాక్‌లోని పలు ప్రాంతాల్లో తాలిబన్ తీవ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు. భారత్ పాటు.. దక్షిణాసియాకు ఇది ప్రమాదకరమని చిదంబరం హెచ్చరించారు.

మేం సేకరించిన లేదా, నిఘా వర్గాలు లేదా ఇతర మార్గాల నుంచి అందిన సమాచారం మేరకు పాక్‌ గడ్డపై తిష్టవేసిన లష్కర్, జైషే మొహ్మద్, హిజ్బుల్ సంస్థలకు చెందిన తీవ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ ప్రయత్నిస్తోందన్నారు. పర్యాటకుల పేరుతో ఈ చొరబాట్లు సాగుతున్నాయన్నారు. వీరంతా భారత్‌లోకి వచ్చేది మారణహోమం సృష్టించేందుకే అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి