ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాతో చేతులు కలపం: పవార్

గురువారం, 29 అక్టోబరు 2009 (16:32 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మతవాద పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీతో చేతులు కలపబోమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాతో చేతులు కలుపుతామని మీరు అడుగుతున్నవి మతిలేని ప్రశ్నలు అని నిర్మొహమాటంగా అన్నారు.

కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక మంత్రి పదవులను ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటున్నట్టు సమాచారం. దీంతో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌ రంగంలోకి దిగారు. ఆయన భాజపా నేతలతో రహస్య మంతనాలు జరిపినట్టు వినికిడి. ఈ మంతనాల్లో తమతో చేతులు కలిపితే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని భాజపా-శివసేన కూటమి నేతలు హామీ ఇచ్చినట్టు అజిత్ పవార్ స్వయంగా గురువారం బాంబు పేల్చారు.

దీనిపై శరద్ పవార్‌పై ఢిల్లీలో మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదంతా పొలిటికల్ గేమ్. ఇలాంటివన్నీ అర్థరహితం. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అజిత్ పవార్ హద్దులు దాటుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.

ఈ ఊహాగానాలను భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నితిన్ గడ్కారి కూడా తోసిపుచ్చారు. మా నుంచి ఎవరికీ ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదు. ప్రత్యర్థి గ్రూపుతో అజిత్ పవార్ సంప్రదింపులు జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదు. ఆయనను ఎవరు కలిశారో నాకు తెలియదని చెప్పారు.

అదేసమయంలో శివసేన నేత మనోహర్ జోషీ మాట్లాడుతూ.. అజిత్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదు. ఆయన మార్టీకేమీ అంటరాని వ్యక్తికాదని చెప్పడం కొసమెరుపు.

వెబ్దునియా పై చదవండి