మారిన పరిణామాలు.. తెలంగాణ కథ కంచికేనా!

సోమవారం, 21 డిశెంబరు 2009 (13:13 IST)
పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా సీమాంధ్రలో సమైక్యాంధ్ర లక్ష్య సాధనకు జరుగుతున్న ఉద్యమాల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది. పోలీసులు ఒకచోట దీక్ష భగ్నం చేస్తుంటే మరోచోట కొత్తగా రెండు మూడు దీక్షా శిబిరాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే సూచనలు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం సమైక్యాంధ్ర- తెలంగాణా చిక్కుముడి విప్పే ప్రటన చేయవచ్చని సంకేతాలు వస్తున్నాయి. కేంద్రం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుందన్న అంశంపై యావదాంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఆసక్తి నెలకొంది.

ఇదిలావుండగా సోమవారం ఉదయం సీమాంధ్ర ఎంపీలు ప్రధానమంత్రి మన్మోహన్‌తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణా ప్రకటన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను ప్రధానికి వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు విన్నవించారు. అన్నీ సావధానంగా విన్న ప్రధాని శాంతియుత వాతావరణం కల్పిస్తే అన్నీ చక్కబడతాయని హామీ ఇచ్చినట్టు సమాచారం.

అయితే, ఇప్పటివరకూ తెలంగాణా అంశం పట్ల తన వైఖరిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేయలేదు కదా.. మీడియా ముందుకు వచ్చేందుకు సైతం ఆయన సాహసం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణా ప్రక్రియ మొదలుపెడతామని కేంద్రం చెప్పే అవకాశామున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్ర రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని చెప్పేందుకు యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయక పోవచ్చు. అదేసమయంలో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజలకు సుస్పష్టం చేయనుందనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రధాన ప్రతిపక్షం తెదేపా, ప్రరాపా వంటి పార్టీలు సహకరించలేదనే సాకుతో తెలంగాణ అంశాన్ని తాత్కాలికంగా (ఒక రకంగా చెప్పాలంటే శాశ్వతంగా) పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు వస్తున్నాయి.

మొత్తం ఇటు రాష్ట్రంలో అటు హస్తినలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ అంశంపై పునరాలోచన చేసేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం కేంద్రం ఒక ప్రకటన చేస్తుందని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఢిల్లీలో వెల్లడించడం గమనార్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణా ఏర్పాటు దాదాపు అసాధ్యమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి