విడిపోతే నష్టపోతాం.. కాంగ్రెస్‌కు సీఎం కరుణానిధి సూచన!

ప్రస్తుతం కొనసాగుతున్న పొత్తును వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కాంగ్రెస్ అధిష్టానికి సూచించారు. ఈ పొత్తును తెగదెంపులు చేసుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతామని ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు డీఎంకే-కాంగ్రెస్ పొత్తుకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న కొందరు తుంటరి నేతలను కాంగ్రెస్ అధిష్టానం కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు తెగితే అది ఇరు పార్టీలకూ నష్టం చేకూరుస్తుందన్నారు. పొత్తు చెదిరిపోతే.. రాష్ట్రంలో మతతత్వ శక్తులకు బలం చేకూర్చి పెడుతుందన్నారు. రాష్ట్రంలో మా పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న పొత్తును చూసి కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.

ఇలాంటి నేతల దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానంపై ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ పనితీరుపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఆరోపణలపై పార్లమెంటు ఉభయసభల్లో స్తంభించిన కార్యకలాపాలు తిరిగి సజావుగా సాగాలనే తమ పార్టీ నేత ఎ.రాజాను మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరామని కరుణానిధి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి