బడ్జెట్ సమావేశాలనూ సజావుగా సాగనీయం: అద్వానీ

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయని పక్షంలో ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలను సైతం సజావుగా సాగనీయబోమని భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీ హెచ్చరించారు. స్పెక్ట్రమ్ కుంభకోణం వ్యవహారంపై జేపీసీ ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై శుక్రవారానికి 16 రోజులు కావస్తున్నా.. సభ పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు.

ఈ భేటీ అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ.. 1.74 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిన 2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుపై సమగ్ర విచారణ జరపటానికి జేపీసీని నియమించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించకపోవటం వల్లే శీతాకాల సమావేశాలు జరగడం లేదన్నారు.

ప్రతిపక్షాలు డిమాండ్‌ను యూపీఏ పెద్దమనస్సుతో అర్థం చేసుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న విశ్వాసాన్ని అద్వానీ వ్యక్తం చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో కొత్త కోణాలు వెలువడుతున్నందున జేపీసీ తప్ప పీఏసీ వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదన్నారు.

వెబ్దునియా పై చదవండి