అయోధ్య భూవివాదం పరిష్కారానికి సుప్రీంకు ఫార్ములా!

అయోధ్య భూవివాదం సమస్య పరిష్కారానికి తాము సుప్రీంకోర్టుకు ఒక ఫార్ములా సమర్పిస్తామని ఈ కేసులో ప్రధాన కక్షిదారులైన మహంత్ జ్ఞాన్‌దాస్, అన్సారీలు వెల్లడించారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కక్షిదారులందరూ సుప్రీంకు రావడం కోసం తాము వేచి ఉండి, అప్పుడు తాము రూపొందించిన ఫార్ములాను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తామని వీరిద్దరూ పేర్కొన్నారు. కాగా ఈ ఫార్ములాను ఈ నెల పదవ తేదీన బహిరంగ పరుస్తామని అన్సారీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడిగా ఉండిన జ్ఞాన్‌దాస్‌ను ఈ మధ్యనే ఆ పదవినుంచి తప్పించిన విషయం తెలిసిందే. కాగా, విశ్వ హిందూ పరిషత్, దాని అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అఖాడాలో విభేదాలు సృష్టిస్తున్నారని జ్ఞాన దాస్ ఆరోపించారు.

‘వీహెచ్‌పీ ఒక దోపిడీ దారుల ముఠా. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడం వారికి ఎట్టి పరిస్థితుల్లోను ఇష్టం లేదు. వాళ్లకు రాజకీయం చేయడంలోను, అల్లర్లను రెచ్చగొట్టడంలో మాత్రమే ఆసక్తి ఉంది’ అని జ్ఞాన్‌దాస్ విరుచుకుపడ్డారు.

వెబ్దునియా పై చదవండి