కాంగ్రెస్‌కు పరీక్షా సమయం: సవాళ్ళను ఎదుర్కుంటున్నాం

ఆదివారం, 19 డిశెంబరు 2010 (14:36 IST)
అఖిల భారత కాంగ్రెస్ కమిటి (ఏఐసీసీ) ప్లీనరీ రెండో రోజు సమావేశం ఆదివారం ఉదయం వాడి వేడిగా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యువనేత రాహుల్ గాంధీ సహా పలువురు ఏఐసీసీ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పెను సవాళ్ళను ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రతీ నేతా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికలలో పరాజయం పాలవ్వడాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలో లేని రాష్ట్రాల్లో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వీటిపై నేతలు దృష్టి సారించాలని ఆమె సూచించారు.

అంతే కాకుండా.. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని విస్మరించరాదని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పివి నరసింహరావును ఆమె గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశం అభివృద్ధి బాటలో పయనించేందుకు బీజం వేశాయని సోనియా ప్రశంసించారు.

వెబ్దునియా పై చదవండి