ఆరుషి హత్య కేసులో సాక్ష్యాలు ఏవీ దొరక్కపోవడంతో తొలుత ఆ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించిన సిబిఐ ఆ తర్వాత.. ఆమెను తన తండ్రే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే సిబిఐ ఆరోపణలను ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ ఖండించారు. సిబిఐ తమ లోపాల్ని కప్పి పుచ్చుకోవడానికే ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.
అంతే కాకుండా.. తమ ఇంటిలో పనిచేసిన హేమరాజ్ హత్యకు కూడా తననే తప్పు పట్టడాన్ని రాజేష్ దుయ్యబట్టారు. ఈ కేసులో సిబిఐ వ్యక్తం చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం ఊహాగానాలేనని రాజేష్ అన్నారు. విచారణ పేరుతో తనను ఇప్పటికే ఎంతగానో వేధించారని, ఈ కేసులో ఇలా విచారణకు గురి చేయడం ఇది రెండవసారని ఆయన వాపోయారు.
అమాయకుల విషయంలో సిబిఐ వ్యవహరించే తీరు ఇదేనా...? కుమార్తెను కోల్పోయిన తండ్రిని నేను అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ ఆరోపణలను ఆరుషి తల్లి సూపుర్ కూడా తిప్పికొట్టారు. తన భర్తపై సిబిఐ ఆరోపణలు చేయడం ద్వారా తమ మందకొడి దర్యాప్తును కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని ఆమె అన్నారు.