ఉల్లి షాపు‌లు మూతపెడితే అంతేసంగతులు!: షీలా దీక్షిత్

ఉల్లిపాయలతో పాటు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలను మూతపెట్టి ధర్నాకు దిగే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉల్లిపాయలు అమ్మే షాపులను మూతపెట్టే వ్యాపారులపై ఎస్మా చట్టం అమలు చేస్తామని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నప్పటికీ, వ్యాపార సంఘాల ద్వారా నడిచే దుకాణాల ద్వారా ఉల్లి ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయని షీలా దీక్షిత్ పేర్కొన్నారు. ఉల్లి ధరల పెంపుతో వ్యాపారులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే నిరవధిక బంద్ చేపట్టే వ్యాపారులపై ఎస్మా చట్టం అమలు తప్పదన్నారు.

కాగా.. ఆసియాలో అతిపెద్ద కాయగూరల బజార్ అయిన ఢిల్లీ అజాద్‌పూర్‌లో ఆదాయపన్ను శాఖ రెండు రోజుల క్రితం తనిఖీలు నిర్వహించింది. ఇందుకు నిరసన వ్యక్తం చేసిన వ్యాపార సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి