మావోయిస్టుల నియంత్రణకు రూ.590 కోట్లు కేటాయింపు

దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 590 కోట్ల రూపాయలను కేటాయించింది. ఖనిజ సంపద, అటవీ ప్రాంతం అధికంగా ఉన్న మధ్య, తూర్పు భారతంలోని తొమ్మిది రాష్ట్రాల్లో గిరిజన హక్కుల కోసం సాయుధ పోరు సాగిస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. వీటిని నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు సమకూర్చింది.

ప్రత్యేక భద్రతా పథకం పేరుతో వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే ప్రణాళికేతర వ్యయం కింద రూ.590 కోట్లు కేటాయించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం వేగంగా జరిగేందుకు, అదనంగా 12 వేల మంది ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పిఓ)లను నియమించడానికి ఈ నిధులను వినియోగిస్తారు.

ఈ తొమ్మిది రాష్ట్రాల్లో 35 జిల్లాలు నక్సల్స్ పీడిత జిల్లాలుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, ఈ సంఖ్యను 60కి పెంచాలని నిర్ణయించింది. కొత్తగా మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాలోని మావోయిస్టుల ప్రభావిత జిల్లాలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల కోసం కేటాయించిన నిధుల్లో ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చిలోగా రూ.320 కోట్లకు పైగా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి