దేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేయడమే: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో పన్నులు ఎగ్గొట్టి విదేశీ బ్యాంకుల్లో కోటానుకోట్ల రూపాయలు దాచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేయడంతో సమానమని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నల్లధనం అక్రమార్కుల వివరాలను వెల్లడించడంలో కేంద్రం వైఖరిని కూడా సుప్రీం తప్పుబట్టింది.
స్విస్ బ్యాంకుతో పాటు పలు విదేశీ బ్యాంకుల్లో మన దేశానికి చెందిన కోటీశ్వరులు, రాజకీయనేతలు దాచిపెట్టుకున్న నల్లధనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా, ఈ ధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీతో పాటు.. పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్‌లపై జస్టీస్ బి.సుదర్శన్ రెడ్డి, ఎస్ఎస్.నిజ్జర్‌ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నల్లధనం ఏయే దేశాల్లో ఏయే బ్యాంకుల్లో ఉందో కేంద్రం వెల్లడించడంలేదన్నారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకోవడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేయడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేర్కొంటూ ఈ కేసుపై తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.