తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం 'యు' టర్న్!!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ యు టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న ఆరు సూచనల్లో దేనివైపు మొగ్గు చూపినా పార్టీకి కష్టాలు తప్పవనే భావన నెలకొంది. దీంతో తెలంగాణ రొచ్చు నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తోంది.

ఇందుకోసం కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్‌ను రంగంలోకి దించింది. తెలంగాణ అంశంలో కేంద్రంలోని యూపీఏ సర్కారు తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కారు.

దీనిద్వారా తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ పరిధిలో లేదనే విషయాన్ని చాటింపు వేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. అదేసమయంలో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు ముగియలేదనీ.. మున్ముందు కూడా జరుగుతాయని చెప్పారు.

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా జఠిలమైన తెలంగాణ సమస్య నుంచి పార్టీని ఒడ్డుకు చేర్చడమే కాకుండా, నెపాన్ని కేంద్రంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలపై నెట్టివేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో లేదని, పలుపార్టీలతో కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినపుడే ఆ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమన్నది షకీల్ అహ్మద్ మాటల్లో తేటతెల్లమైంది.

ఇకపోతే.. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన తప్పించుకునే ధోరణిని వ్యక్తం చేశారు. ఆ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీని అడగాలని మీడియాకు సూచించారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తనను తాను రక్షించుకునే ధోరణి (2014 వరకు)తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు.

వెబ్దునియా పై చదవండి