నీతివంతమైన పాలన అందించేందుకు కృషి : మన్మోహన్

ఆదివారం, 1 జనవరి 2012 (10:29 IST)
దేశంలో నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు వ్యక్తిగతంగా కూడ కృషి చేస్తానని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన, నీతివంతమైన పాలన అందిస్తానని ఈ కొత్త సంవత్సర శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ హామి ఇస్తున్నట్టు చెప్పారు.

లక్ష్య సాధనలో అవరోధాలు ఎదురైనా, దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవస్థలో నూతనోత్తేజం నింపేందుకు, సమర్థ పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత కోసం భారీ స్థాయిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం పౌరసేవల బిల్లు, న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం బిల్లులను ప్రవేశపెట్టిందన్నారు.

అవినీతిని అరికట్టేందుకు పటిష్ట లోక్పాల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెను సమస్యగా మారిన అవినీతి నిర్మూలనకు బహుముఖ విధానాన్ని అవలంబించాల్సి ఉందన్నారు. లోక్పాల్, లోకాయుక్తలు అందులో భాగమేనని అయితే, బిల్లు ఆమోదం పొందక పోవడం దురదృష్టకరమన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ప్రధాని తొమ్మిది పేజీల ప్రకటన విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి