మమతకు పోస్టరు తిప్పలు... సోనియా చేతిలో కుక్కగా మారిన డిప్యూటీ ఈసీ!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:02 IST)
PR
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీ ఇపుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అందులో ఆమె ప్రమేయం లేకపోయినా ప్రత్యర్థులు ఆమెను విమర్శిస్తున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లాంపూన్స్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుట్‌షిపై ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ ఈ వివాదానికి కారణమయింది.

ఈ పోస్టర్‌లో వినోద్ జుట్‌షిని మమత బెదిరిస్తున్నట్లు ఉంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు వినోద్ జుట్‌షి ముఖం ఉన్న కుక్కను బెల్టుతో పట్టుకుని మమతపై ఉసిగొల్పుతున్నట్లు, ఆమె ఆ కుక్కను బెదిరిస్తున్నట్లు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ పోస్టరు కోల్‌కతా శివార్లలోని కోన్నార్ నగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్‌ను పోలీసులు వెంటనే తొలగించారు.

డిప్యూటీ ఈసీని కుక్కగా చూపడంతో ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. పోస్టరు ఏర్పాటు చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఈసీ ఆదేశించింది. అయితే ఈ పోస్టరును ఎవరు ఏర్పాటు చేశారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు మధ్య సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కేడర్ నుంచి డిప్యుటేషన్‌పై డిప్యూటీ ఈసీగా జుట్‌షిని నియమించారు. అయితే ఆయన్ను విధుల నుంచి తొలగించాలని మమత వారం రోజుల క్రితం డిమాండ్ చేశారు. ఆయన కాంగ్రెస్, బీజీపీ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల అతన్ని విధుల నుంచి తప్పించాలని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈవిధంగా పోస్టర్ ఏర్పాటు కావడంతో మమతకు తిప్పలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి