చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరుగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా.. మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అలాంటి గోరింటాకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే..? గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తున్నాయి.
రావణుడిని సంహరించి.. రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద.. అశోకవనంలో తానుంతకాలం .. ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది.
అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో.. సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి.. గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో.. వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.. వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.
అందుకే ఇప్పటివరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు.. వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే.. మహిళలకు ఎలాంటి కష్టాలుండవని.. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.